You are here: Home / Access to Knowledge / Blogs / వాట్సాప్ సాహిత్య వేదిక నుంచి వికీసోర్సుకు

వాట్సాప్ సాహిత్య వేదిక నుంచి వికీసోర్సుకు

Posted by Pavan Santhosh at Jul 31, 2018 04:55 PM |
పద్యసౌందర్యం గ్రూపు సభ్యులకు వికీసోర్సు పరిచయం

తెలుగు స్వేచ్ఛా విజ్ఞాన ఉద్యమ సహచరులకు,
నమస్కారం. ఓ వాట్సాప్ సముదాయం గురించి ఇంతగా చెప్పడమేంటని, దాని నుంచి స్వేచ్ఛా విజ్ఞాన ఉద్యమానికి జరిగే మేలేమిటనీ మీకు ఆశ్చర్యం కలగవచ్చు.

అదేమీ సాధారణమైన వాట్సాప్ సముదాయం కాదు, గుడ్‌మార్నింగుతో ఓ దారీపోయే ఫోటో, గుడ్‌నైట్‌తో సంబంధంలేని వీడియో పంపేసి రోజును ముగించే పద్ధతి అక్కడ నిషిద్ధం. ఆ వేదిక మీద వారానికి ఐదురోజుల పాటు రోజుకొక కావ్యంలో కనీసం 20 పద్యాల విశ్లేషణ జరుగుతూంటుంది, ఆది, సోమవారాల్లో పద్యరచనలో శిక్షణ, తోచిన పద్యాలను గురించి చర్చ సాగుతుంది. ఎక్కడా ఎవరూ అనవసరమైన అంశాల ప్రస్తావన చేయడానికో, ప్రచారాలు సాగించుకోవడానికో వీలు లేదు. అలా వారు వ్యాఖ్యానించుకున్న శివభారతం పద్యకావ్యాన్ని వ్యాఖ్యాన సహితంగా సీడీల్లో అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ప్రతీ ఏటా గురుపౌర్ణమి తర్వాత వచ్చే శని ఆదివారాలు విశాఖపట్టణంలో సమావేశమై పద్యాలను వారి రసజ్ఞ హృదయానికి నివేదిస్తారు, ఒకరికొకరు సన్నిహితులవుతూంటారు. అటువంటి అత్యంత అరుదైన సముదాయం పేరు పద్యసౌందర్యం, వారి కార్యక్రమం పేరు సారస్వత జ్యోత్స్న.
నేను వ్యక్తిగతంగా ఆ సముదాయంలో సభ్యుడిని, వారి క్రమశిక్షణ, సాహిత్య వ్యాఖ్యానం పట్ల, రసజ్ఞత లోతులు చూడడం పట్ల నిబద్ధత చూశాకా ఆశ్చర్యం కలిగింది. 2017లో జరిగిన సారస్వత జ్యోత్స్నలో పాల్గొన్నప్పుడు, వేదిక మీద నాకు ఇచ్చిన కొద్దిపాటి అవకాశాన్ని పురస్కరించుకుని తెలుగు వికీసోర్సు ద్వారా కాపీహక్కులు చెల్లిపోయినవి, సీసీ-బై-ఎస్‌ఎ లైసెన్సులో విడుదలైనవి అయిన పలు పుస్తకాలు ఎలా భావి తరాలకు అందేలా డిజిటైజ్ చేస్తున్నామో చెప్పాను. వెనువెంటనే సంప్రదించిన ఇద్దరు సభ్యులు - గుంటుపల్లి రామేశం, జి.ఎస్.వి.ఎస్.మూర్తి గార్లు అదే నెలలో జరిగిన వికీసోర్సు కార్యశాలలో పాల్గొని ఈనాటికీ వికీసోర్సులో వందలాది పుటలు మెరుగుపరుస్తూ, పుస్తకాలను పూర్తిచేస్తూ కొనసాగుతున్నారు. వీరిలో Ramesam54 కట్టా వరదరాజ కవి రామాయణ పద్యకావ్యాన్ని వికీసోర్సులో డిజిటైజ్ చేస్తూనే, ఆ పాఠ్యానికి తమ వ్యాఖ్యానం జోడిస్తూ అదే పద్యకావ్యాన్ని పద్యసౌందర్యం వాట్సాప్ గ్రూపులో వ్యాఖ్యానిస్తూ అలరిస్తూన్నారు. స్వామికార్యం స్వకార్యంలాగా అన్నమాట. Gsvsmurthy ఆంగ్ల వికీసోర్సులోకి వెళ్ళి Convocation Addresses of the Universities of Bombay and Madras అన్న పుస్తకం మీద పనిచేస్తున్నారు.
ఈ నేపథ్యంలో 2018 జూలై 28, 29 తేదీల్లో విశాఖపట్టణంలో జరిగిన రెండవ వార్షికోత్సవం - సారస్వత జ్యోత్స్నకు కూడా హాజరయ్యాను. కార్యక్రమం మొదటిరోజున భాగవతోద్యాన కోకిల అన్న బిరుదు పొందిన పౌరాణికులు జటావల్లభుల జగన్నాథం గారిని సత్కరించి, ఆయన ప్రసంగం ఏర్పాటుచేశారు. వేదికలోని పండితుడు, ఛందోగురువు సాంప్రతి సురేంద్రనాథ్‌, పద్యవిద్య ఛందోగ్రంథకర్త, అవధాని పేరి రవికుమార్ ప్రసంగించారు. తర్వాతిరోజు సాంప్రతి సురేంద్రనాథ్‌, పేరి రవికుమార్‌ల ఆధ్వర్యంలో పద్యసౌందర్య వేదిక సభ్యుల్లో ఆసక్తి కలవారు చెరొక మూడు పద్యాలూ సమర్పించి, వాటిపై తమ అవగాహన మేరకు వ్యాఖ్యానించగా, గురువులు విశేష వ్యాఖ్యానం చేశారు. రాంప్రసాద్‌ గారి ఆధ్వర్యంలో హంస అకాడమీ కార్యక్రమాన్ని నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో రెండవ రోజున నేను (పవన్ సంతోష్‌) సభ్యుల్లో ఆసక్తి కల కొద్దిమందికి వికీసోర్సులో పద్యసాహిత్యాన్ని భద్రపరచడంలో ఉన్న ప్రయోజనాన్ని, ఆవశ్యకతను వివరించాను. అందులో ప్రత్యేకించి అవధానం చంద్రశేఖరశర్మ కుమారులు అవధానం అవధానం విశ్వనాథ శర్మతో తండ్రి రచించిన శ్రీ దేవీసువర్ణమాల పుస్తకాన్ని సీసీ-బై-ఎస్‌ఎ లైసెన్సులో పునర్విడుదల చేయించి, వారే టైపు చేసేలా శిక్షణనిచ్చాను, అయితే వారిది మొబైల్ మాధ్యమం కావడం వల్ల వికీసోర్సులో టైపు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొని వాటిని కొంతమేరకు పరిష్కరించుకున్నాం. వై.వి.ఎస్.ఎన్.మూర్తి గారికీ తెలుగు వికీసోర్సులో మౌలిక శిక్షణను ఇచ్చి, తర్వాత వారు టైపు చేయడంలో, మార్కప్‌కోడ్ నేర్వడం వంటివి ఫాలో-అప్ చేస్తున్నాను. ఈ ప్రయత్నాలలో పద్యసౌందర్య సభ్యులు, తెలుగు వికీసోర్సు వాడుకరి గుంటుపల్లి రామేశం చక్కని సహకారం అందించారు. ఇతర సభ్యులు మరికొందరు కూడా వికీసోర్సు వేదిక ద్వారా కృషిచేయడానికి ఆసక్తి చూపిస్తూండడంతో ఒక కార్యశాలను ప్రత్యేకించి వీరికోసమే చేయవచ్చన్న నిర్ణయానికి నేనూ, రామేశం గారూ వచ్చాం.
కమనీయమైన సారస్వత జ్యోత్స్న గంభీరమైన వికీసోర్సు మీద కాచి, తెలుగు సాహితీ లోకానికి పద్యసౌందర్యాన్ని పంచిపెడుతుందనే నమ్ముతూ ముగిస్తున్నాను.

విశాఖపట్టణం,
2018 జూలై 31