You are here: Home / Access to Knowledge / Blogs / మిసిమి పత్రిక గ్రంథాలయంలో తెలుగు వికీపీడియన్ల కార్యక్రమం

మిసిమి పత్రిక గ్రంథాలయంలో తెలుగు వికీపీడియన్ల కార్యక్రమం

Posted by Pavan Santhosh at Aug 22, 2018 03:11 PM |
తెలుగు నాట లలిత కళలపై రసజ్ఞత పెంపొందించేందుకు దశాబ్దాలుగా పనిచేస్తున్న పత్రికల్లో మిసిమి విశిష్టమైనది.

ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కళాకారుల గురించి కావచ్చు, తెలుగునాట మరుగునపడ్డ చిత్రకారుని గురించి కావచ్చు - తెలుగులో లోటుగా ఉన్న ఆసక్తిదాయకమైన. విజ్ఞానదాయకమైన అంశాలపై మిసిమి వెలుగుపరచడం తెలిసిందే. అలాంటి మిసిమి పత్రిక తమ గ్రంథాలయంలో గత దశాబ్ది పాటు అంతర్జాలంలో తెలుగులో స్వేచ్ఛా విజ్ఞాన సృష్టి చేస్తున్న తెలుగు వికీపీడియా హైదరాబాద్ సమావేశానికి, వికీడేటా లేబుల్‌-అ-థాన్‌కి ఆతిథ్యమిచ్చారు. కార్యక్రమాన్ని తెలుగు వికీపీడియా, సీఐఎస్‌-ఎ2కెల తరఫు నుంచి పవన్‌ సంతోష్‌ నిర్వహించగా, మిసిమి వైపు నుంచి సంపాదక మండలి సభ్యుడు కాండ్రేగుల నాగేశ్వరరావు, ప్రధాన సంపాదకుడు వల్లభనేని అశ్వనీకుమార్ సమన్వయపరిచారు. నిర్వహించిన పవన్‌ సంతోష్‌తో పాటు తెలుగు వికీడియన్‌లు ప్రణయ్‌రాజ్‌, రహ్మానుద్దీన్, వీవెన్, అజయ్‌ పాల్గొన్నారు. మిసిమి సంపాదకులు వల్లభనేని అశ్వినీకుమార్, కాండ్రేగుల నాగేశ్వరరావు, మిసిమి రచయితల్లో ఒకరు, ప్రముఖ తెలుగు అనువాదకులు ముక్తవరం పార్థసారధి ఈ సమావేశంలో పాలుపంచుకున్నారు.

Hyderabad Labelathon
మాట్లాడుతున్న పవన్ సంతోష్, చిత్రంలో వీవెన్, వల్లభనేని అశ్వినీకుమార్, అజయ్ బండి, ముక్తవరం పార్ధసారధిలను చూడవచ్చు.

భారత స్వాతంత్ర్య దినోత్సవానికి సంబంధించిన వికీడేటా లేబుల్‌-అ-థాన్‌లో (మారథాన్, ఎడిటథాన్‌లా లేబుల్స్ చేర్చుకుంటూ వెళ్ళడం లేబులథాన్) భాగంగా ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 వరకు పాల్గొన్న వికీపీడియన్లు ఐటంలకు లేబుల్స్ చేర్చారు. లేబులథాన్ థీమ్ ప్రకారం - పలు భాషల కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతలు, భారత స్వాతంత్ర్యోద్యమం గురించి సంఘటనలు, పరిణామాలు, వ్యక్తులు, సంస్థలు, వగైరా ఐటంలకు తెలుగులో లేబుళ్ళు, వివరణలు చేర్చారు. స్వేచ్ఛగా ఉపయోగించుకుని, అభివృద్ధి చేయగల జ్ఞాన గని. వికీపీడియా వాక్యాలు మనుషులు చదవడానికి తేలికైతే వికీడేటా కంప్యూటర్లు చకచకా విశ్లేషించగల స్ట్రక్చర్డ్ డేటా ప్రాజెక్టు. దీనిలో ఒక్కో అంశానికి తెలుగులో పేరును, వివరణను చేరుస్తూ పోవడం అన్నది భావి తెలుగు భాషాభివృద్ధికి ఉపయోగకరం. సాయంత్రం అయ్యేసరికి 280 పైచిలుకు ఐటంలలో వీవెన్, ప్రణయ్, అజయ్, పవన్ సంతోష్‌లు తెలుగు లేబుల్, వివరణలు అభివృద్ధి చేశారు.

Hyderabad Labelathon
వికీడేటా లేబులథాన్లో నిమగ్నమైన సభ్యులు

కార్యక్రమంలో భాగంగా వికీపీడియన్లతో వల్లభనేని అశ్వినీ కుమార్, ముక్తవరం పార్థసారధి పలు అంశాలు చర్చించారు. పవన్ సంతోష్‌ ఈ సందర్భంగా వికీపీడియా నిర్మాణం వెనుక మూలస్తంభాలు, వాటి అమలు, తెలుగు వికీపీడియా స్థితిగతులు వగైరా వివరించారు. ప్రారంభంలో తెలుగు వికీపీడియాలో నెలనెలా ఇరవై నుంచి ముప్పై మిలియన్ల వరకూ పేజీ వ్యూలు ఉంటున్నాయని పవన్, రహ్మాన్ వివరించారు. ప్రధానంగా మొబైల్‌ వేదికగా చదువుతున్న తెలుగువారు తెలుగులోనే సమాచారాన్ని ఆశిస్తున్నారని వివరించారు. (ఇతర బాధ్యతల కారణంగా ఆపైన సమావేశం నుంచి రహ్మాన్ నిష్క్రమించారు) తెలుగు రచయితలు ఎక్కువమంది వివరాలు తెలుగు వికీపీడియాలో దొరకాలని, అందుకు అవసరమైతే డేటా స్థాయిలో తాము సహకరించగలమని వల్లభనేని అశ్వినీకుమార్ పేర్కొనగా తెలుగు వికీపీడియా విషయ ప్రాధాన్యత పరిధిలోని వారికి తెవికీలో వ్యాసాలు సృష్టించడం, మిగిలిన అందరి వివరాలను వేరే వేదికలో సమాచారం అందుబాటులోకి తేవడం చేయవచ్చని వీవెన్ సమాధానమిచ్చారు. ముక్తవరం పార్థసారధి ఉదాహరణ కోసం రచయిత త్రిపుర వ్యాసాన్ని తెరిచి అందులోని సమాచారాన్ని పరిశీలించి ప్రారంభ స్థాయిలో ఉన్నా ఇలా ఎందరో రచయితలు, ఇతర అంశాల గురించి విజ్ఞానాన్ని అందించడం చాలా కీలకమని పేర్కొన్నారు. పార్థసారధి మాట్లాడుతూ ఏ విషయంలోనైనా అత్యున్నత నాణ్యత కోసం అంటూ అసలు పనిచేయకపోవడం కన్నా సాధ్యమైనంత ఉత్తమ నాణ్యతతో పని జరుగుతూండడం మంచిదని తన దృక్పథాన్ని వెల్లడించారు. పవన్ సంతోష్‌ ఒక మంచి వ్యాసాన్ని చూపించి, ఈ స్థాయికి నాణ్యత అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న వికీపీడియన్లూ ఉన్నారని తెలిపారు. పవన్ సంతోష్‌ మాట్లాడుతూ మిసిమి వారు నాణ్యమైన వనరులు రూపొందించినవైన చిత్రకళ, సాహిత్యం, సంగీతం, నాట్యం అన్న నాలుగు అంశాలు తీసుకుని, ఈ రంగాల్లో తెలుగువారి గురించి తెలుగు వికీపీడియాలో నాణ్యమైన సమాచారం రూపొందించేందుకు ప్రామాణిక మూలాలను జాబితా వేయడం అందరికీ ఉపయుక్తమని సూచించారు. చర్చల్లో భాగంగా తెలుగు వికీపీడియా గురించి, తెలుగు వికీపీడియాలో అసలు రాయవచ్చన్న సంగతినీ విస్తృతమైన తెలుగు సముదాయానికి ఎలాగోలా తెలియజేయడం వల్ల వాలంటీర్ల సమస్య తీరుతుందని అభిప్రాయాలు వెల్లడయ్యాయి. ప్రణయ్‌రాజ్ వికీపీడియాలో రాయడం వల్ల ఆత్మతృప్తి, నైపుణ్యం లభిస్తుందని అయితే ఇతర మాధ్యమాల్లా వెనువెంటనే పేరు ప్రఖ్యాతులు రావడం సాధ్యం కాదని, అయినా సిద్ధపడి సేవచేస్తున్న వికీపీడియా సముదాయ సభ్యుల సమున్నత వ్యక్తిత్వం కొనియాడారు. అందరికీ తెలుగులో విజ్ఞానం అన్న తెలుగు వికీపీడియా ఉద్దేశాన్ని ప్రతిధ్వనిస్తూ తమ గ్రంథాలయాన్ని వేదికగా ఇచ్చి, చర్చలో పాల్గొన్నందుకు నిర్వాహకుడు పవన్ సంతోష్‌, వికీపీడియా సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. మిసిమి తరఫున విచ్చేసిన సభ్యులు ప్రతిగా ఒకేలాంటి లక్ష్యాలు ఉన్నందున తెలుగు వికీపీడియన్లు చేసే కృషి పట్ల తమకున్న ఉన్నత భావాన్ని వెల్లడించారు.

Tito Dutta
Tito Dutta says:
Sep 05, 2018 09:54 AM

Thanks for posting this

Commenting has been disabled.